Redmi Note 7 రూ. 9,999కి రాబోతోందా?

చాలా మంది ఆసక్తిగా వేచి చూస్తున్న Redmi Note 7 ఫోన్ దాదాపు పదిహేను రోజుల్లోపు భారతీయ మార్కెట్లో విడుదల అవుతుందని తెలుస్తోంది.

ఇటీవల సంసంగ్ సంస్థ బడ్జెట్ వినియోగదారుల కోసం Galaxy M10, M20 వంటి మోడళ్లను విడుదల చేసిన నేపథ్యంలో, ఈసారి షామీ సంస్థ ధర విషయంలో మరింత పోటాపోటీగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం Redmi Note 7 ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 9,999 ఉండే అవకాశం ఉంది.

ఈ ఫోన్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం 48 మెగా పిక్సెల్ రెజల్యూషన్ కలిగిన కెమెరా. ఇంత తక్కువ ధరలో అంత ఎక్కువ రిజల్యూషన్ ఉన్న కెమెరా కచ్చితంగా వినియోగదారులను ఆకర్షిస్తుంది అనడంలో సందేహం లేదు.

కొంతకాలం క్రితం చైనాలో విడుదలైన ఈ ఫోన్ భారతీయ కరెన్సీ ప్రకారం 3GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ వెలిగిన మోడల్ సుమారు 10,500 రూపాయలకి అమ్మబడుతోంది. అదే 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ 12,500కీ, 6GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ భారతీయ కరెన్సీ ప్రకారం 14,500 రూపాయలకి విక్రయించబడుతోంది.

6.3 అంగుళాల 2340×1080 పిక్సెళ్ల రిజల్యూషన్ కలిగిన ఈ ఫోన్లో, 450 nits బ్రైట్నెస్ లభించటంతో పాటు, NTSC కలర్ స్పెక్ట్రమ్ లో 84 శాతం రంగులు స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తాయి. గొరిల్లా గ్లాస్ 5 చేత ఈ ఫోన్ స్క్రీన్ రక్షించబడుతుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 processor ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ 48 megapixel రిజల్యూషన్ కలిగిన Sony IMX586 ఇమేజ్ సెన్సార్ కలిగి ఉంటుంది. దాంతోపాటు 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా కూడా ఇందులో పొందుపరచబడి ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. 4000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ QuickCharge 4 టెక్నాలజీ ద్వారా బ్యాటరీ వేగంగా ఛార్జింగ్ అవుతుంది.

అలాగే USB Type C పోర్ట్, 4G VoLTE సపోర్ట్, బ్లూటూత్, వై-ఫై వంటి ఇతర సదుపాయాలు కలిగిన ఈ ఫామ్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. గత ఏడాది షామీ సంస్థ వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న Redmi Note 5ని విడుదల చేసింది. దాని ప్రకారం ఈ సారి కూడా దాదాపు అదే రోజు ఈ ఫోన్ భారతీయ మార్కెట్లో విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Comments